AP Assembly: నేడు ఏపీ అసెంబ్లీ..సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కొరడా

నేడు ఏపీ అసెంబ్లీ..సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కొరడా

Naresh.k
Published on: 23 Feb 2026 10:12 AM IST
AP Assembly: నేడు ఏపీ అసెంబ్లీ..సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కొరడా
X

నేడు ఏపీ అసెంబ్లీ

AP Assembly Sessions Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నేడు అసెంబ్లీ వేదికగా ఆసక్తికరంగా మారబోతున్నాయి. నేడు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ప్రజా సమస్యలు, పెండింగ్ బిల్లులు మరియు అభివృద్ధి పనులపై ఈరోజు సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. సభ ప్రారంభం కాగానే మొదటి గంట 'క్వశ్చన్ అవర్' (ప్రశ్నోత్తరాల సమయం) కేటాయించారు. ఇందులో సభ్యులు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ముఖ్యంగా ఈ క్రింది అంశాలు చర్చకు రానున్నాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలపై సభ్యులు వివరణ కోరనున్నారు. కేజీబీవీ (KGBV) పాఠశాలల నిర్వహణతో పాటు, విద్యార్థులకు అందాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల బకాయిలపై ప్రభుత్వం ఇచ్చే సమాధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు.చీరాల నియోజకవర్గంలో వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుపై చర్చ జరగనుంది.యనమదుర్రు డ్రైన్ ఆధునీకరణ పనులు, అవ్యవస్థీకృత కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలపై చర్చలు కొనసాగనున్నాయి.

ప్రస్తుత రోజుల్లో అత్యంత చర్చనీయాంశమైన సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం అనే అంశంపై కూడా సభలో చర్చ జరగనుంది. తప్పుడు వార్తలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. నేటి సభలో ప్రభుత్వం రెండు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన డిమాండ్లు మరియు గ్రాంట్లపై సుదీర్ఘ చర్చ జరగనుంది. నిధుల కేటాయింపులు, గతంలో జరిగిన ఖర్చులు ,భవిష్యత్ ప్రణాళికలపై మంత్రులు సభకు వివరణ ఇవ్వనున్నారు. మొత్తానికి, అటు ప్రజా సమస్యలు, ఇటు అభివృద్ధి పనుల మధ్య ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Next Story