గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. HPV Vaccine ఎందుకు వేయించుకోవాలి, ఎవరికి అవసరమో తెలుసుకోండి!
గర్భాశయ క్యాన్సర్ నివారణలో కీలకమైన HPV వ్యాక్సిన్ ఎందుకు అవసరం? ఎవరికి వేయించుకోవాలి, ఏ వయస్సులో తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. HPV Vaccine ఎందుకు వేయించుకోవాలి, ఎవరికి అవసరమో తెలుసుకోండి!
భారతదేశంలో ఇటీవల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి HPV టీకాను ప్రవేశపెట్టనుంది. ఈ టీకాను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాలికలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ టీకాను అందిస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ టీకా మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షించడంలో గణనీయంగా సహాయపడుతుందని కేంద్రం పేర్కొంది. HPV వ్యాక్సిన్ గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఈ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలంటే..
గర్భాశయ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత, అది గర్భాశయ కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికే HPV టీకాను ఇస్తారు. ఈ టీకాను 9 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే బాలికలకు ఇవ్వడం చాలా ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వయస్సులో పిల్లలు ఇంకా ఆ వైరస్ బారిన పడే అవకాశం ఉండదు కాబట్టి, టీకా వారి శరీరంలో బలమైన రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నారు. ఇటీవల కాలంలో పలు ప్రైవేట్ ఆసుపత్రులలో 25 నుంచి 35 ఏళ్ల మహిళలు కూడా ఈ టీకా తీసుకుంటున్నారు, కానీ చిన్న వయసులో తీసుకుంటేనే ఇది ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
సాధారణంగా ఈ వ్యాక్సిన్‌ను రెండు సార్లు తీసుకోవాలన్నారు. మొదటి డోస్ తర్వాత, రెండవ డోస్‌ను ఫస్ట్ డోస్ తీసుకున్న 6 నెలల తర్వాత తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ టీకా ప్రైవేట్ ఆసుపత్రులలో చాలా ఖరీదుగా (ఒక డోస్ రూ.2,000 నుంచి రూ.4,000 వరకు) ఉంది. అందుకే సామాన్యులకు కూడా ఇది అందాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం త్వరలో 14 ఏళ్లలోపు బాలికలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఈ టీకాను అందించాలని నిర్ణయించింది. ఈ టీకా పూర్తి సురక్షితం అని, ఎన్నో ఏళ్ల పరిశోధనల తర్వాతే దీనిని అందుబాటులోకి తెచ్చారని వైద్యులు చెప్పారు. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకర వైరస్ రకాల (ముఖ్యంగా 16, 18 రకాలు) నుంచి రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడానికి ఈ టీకా ఒక వరం లాంటిదని చెప్పారు. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన 9-14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో వారికి క్యాన్సర్ ముప్పు లేకుండా చేయవచ్చని సూచించారు.




