Telangana Cabinet: మెట్రో ఇక సర్కార్ సొంతం..TTDకి 20.. JNTU కి 70 ఎకరాలు..రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Telangana Cabinet: మెట్రో ఇక సర్కార్ సొంతం..TTDకి 20.. JNTU కి 70 ఎకరాలు..రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు

CR Reddy
Published on: 24 Feb 2026 7:00 AM IST
Telangana Cabinet
X

Telangana Cabinet: మెట్రో ఇక సర్కార్ సొంతం..TTDకి 20.. JNTU కి 70 ఎకరాలు..రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం (ఫిబ్రవరి 23) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మెట్రో రైలు స్వాధీనం నుంచి బడ్జెట్ సమావేశాల వరకు ఎన్నో కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు రూ.13,000 కోట్ల రుణాన్ని ప్రభుత్వం భరించడంతో పాటు, ఎల్ అండ్ టీకి వన్ టైమ్ సెటిల్‌మెంట్‌ కింద మరో రూ.2,000 కోట్లు చెల్లించనుంది. మెట్రో రెండో దశ విస్తరణను వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (TVVP) పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‎గా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో టీవీవీపీ కింద పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు ఇకపై నేరుగా ప్రభుత్వ పరిధిలోకి వస్తారు. తద్వారా వారికి సర్వీసు సంబంధిత ప్రయోజనాలు, పదవీ విరమణ బెనిఫిట్స్ మెరుగుపడనున్నాయి.

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను కూడా కేబినెట్ ఖరారు చేసింది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 16న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. 17, 18 తేదీల్లో ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. 19న ఉగాది సెలవు కావడంతో, మార్చి 20వ తేదీన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

భూకేటాయింపుల విషయంలోనూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 20 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో JNTU కాలేజీ భవన నిర్మాణానికి 70 ఎకరాలను మంజూరు చేసింది. దీనితో పాటు ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ.528 కోట్లతో క్యాష్‌లెస్‌ హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.

Next Story