Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం..హైదరాబాద్‎కు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులు వానలే

తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం..హైదరాబాద్‎కు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులు వానలే

CR Reddy
Published on: 24 Feb 2026 8:50 AM IST
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం..హైదరాబాద్‎కు ఆరెంజ్ అలర్ట్, మరో రెండు రోజులు వానలే
X

Rain Alert: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు అకాల వర్షం పెద్ద ఊరటనిచ్చింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన దంచికొడుతోంది. హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ, అదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం కనిపిస్తోంది. వాతావరణం చల్లబడటంతో జనం హమ్మయ్య అనుకుంటున్నా, కొన్ని చోట్ల వడగళ్ల వాన రైతులకు కన్నీళ్లు మిగిలిస్తోంది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనం కాస్త బలహీనపడినా, దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ అకాల వర్షం రైతులపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతోంది. యాసంగి వరి పంటతో పాటు వేరుశనగ, పెసర, జొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలకు ఈ నీరు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు కొన్ని చోట్ల నేలవాలడం ఆందోళన కలిగిస్తోంది. వడగళ్ల వాన పడిన ప్రాంతాల్లో పంట నష్టం వాటిల్లింది. మరోవైపు, పలు గ్రామాల్లో ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లోనే గడపాల్సి వచ్చింది.

హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై ముసురు వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, ఆల్వాల్, బషీర్‌బాగ్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేడు, రేపు కూడా అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, జనగాం వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Next Story